Tuesday, October 30, 2012

AP GAP: A Unknown Story About Mahatma

AP GAP
A Unknown Story About Mahatma
Oct 30th 2012, 16:27

 

ప్రాయశ్చిత్తం…

 

 

ఆ పిల్లాడి వయస్సు పన్నెండేళ్లు. అప్పుడప్పుడే బుద్ది వికసిస్తోంది. ప్రపంచాన్ని పరికించి చూడటం నేర్చుకుంటున్నాడు. చూసింది అనుకరించడం అలవాటు చేసుకుంటున్నాడు.
అతడి బంధువొకడు సిగరెట్ పీల్చేవాడు. ఆ బంధువును చూసి ఈ పిల్లవాడు కూడా సిగరెట్ తాగడం నేర్చుకున్నాడు. సిగరెట్ నచ్చలేదు. కానీ గుప్పు గుప్పున పొగ వదలడం మాత్రం మహా సరదాగా ఉండేది.
కానీ పెద్ద చిక్కు వచ్చిపడింది. పెద్దల ముందు సిగరెట్ తాగడం అసంభవం. అలాంటప్పుడు సిగరెట్ కొనడానికి డబ్బు ఎలా అడగటం?
ఎవరో అతనికి ఫలానా చెట్టు కాడ కాల్చి పొగపీలిస్తే అచ్చు సిగరెట్ తాగినట్టుంటుందని చెప్పాడు. చవకబేరం కదా అని ఆ పనీ చేశాడు.
కానీ సిగరెట్ లోని మజా దొరకలేదు. దాంతో ఇంట్లోని నౌకర్ల జేబులు తడిమి హస్తలాఘవం ప్రదర్శించడం మొదలుపెట్టాడు.
హఠాత్తుగా ఒక రోజు ఆ అబ్బాయిని ఎవరో కుదిపినట్టయింది. దొంగచాటుగా సిగరెట్ తాగడం ఎందుకు? దాని కోసం దొంగతనం ఎందుకు? అనుకున్నాడు.
“ఛీ… ఇదేం బ్రతుకు” అనుకుని ఉమ్మెత్త గింజలు తిని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొన్ని గింజల్ని తెచ్చి పొడిగా చేసి తినడానికి సిద్ధమయ్యాడు.
కానీ ధైర్యం చాలలేదు.
చనిపోవడం అన్న ఆలోచన అతడిని భయపెట్టింది.
ఖర్మగాలి చావకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఇంకా భయపెట్టింది.
చివరికి ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకున్నాడు.
సిగరెట్ జబ్బు వదిలింది.
దొంగతనమూ మానేశాడు…

ఆ కుర్రాడికి చాపల్యం పోలేదు. చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉన్నాడు.
అలా అలా అవసరాలకని ఒక బంధువు దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చడం కష్టమైపోయింది. అమ్మనీ, నాన్ననీ అడగడానికి ధైర్యం చాలలేదు.
చివరికి ఒక ఆలోచన వచ్చింది.
ముంజేతికి ఉన్న బంగారు కడియంలో ఒక ముక్క ఇచ్చి అప్పు తీర్చేస్తే పోలా… అనుకున్నాడు.
అదే చేశాడు.
అప్పయితే తీర్చాడు… కానీ అతనిలో అంతర్మథనం మొదలైంది.
“అయ్యో… ఎంత తప్పు చేశాను… నా పాపానికి నిష్కృతి లేదు” అని వేదన చెందాడు.
చివరికి తండ్రి కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పేయ్యాలని, కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగేయాలని అనుకున్నాడు.
కానీ తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది.
అటు పశ్చాత్తాపం…
ఇటు పిరికితనం….
ఈ రెండూ అతడిని దహించివేయసాగాయి.

చివరికి జరిగిందంతా ఒక కాగితం మీద రాసి, తను మరెన్నడూ తప్పుచేయనని, సన్మార్గంలో నడుస్తానని వాగ్దానం చేశాడు.
ఆ లేఖను తండ్రి పాదల దగ్గర ఉంచి తలుపుచాటున నిలుచున్నాడు.
అప్పుడు తండ్రికి జ్వరం… మంచం పట్టి ఉన్నాడు.
ఆయన ఆ లేఖను చూసి, నెమ్మదిగా ఎలాగోలా ఓపిక తెచ్చుకుని దాన్ని ఆసాంతం చదివాడు.
ఆయన కళ్లలో నీరు ఉబికింది.
అది జలజలా ఉత్తరంపై రాలింది.
ఆయన కళ్లు రెండూ మూసుకున్నారు.
ఆ లేఖను ముక్కముక్కలుగా చించేశారు.
పిల్లవాడిని ఆయన ఒక్కమాటా అనలేదు.

ఆ పిల్లవాడు అవాక్కయ్యాడు. తండ్రి ఒక్క మాటా అనకపోవడం అతడిని తీవ్రంగా బాధించింది. గుండెలోతుల్లో గునపం గుచ్చినంత వేదన కలిగింది. తండ్రి ఎంత కలత చెందారో అతను కళ్లారా చూశాడు. ఆ మౌన వేదన ఆ పిల్లాడిని మార్చేసింది.

పెద్దవాడయ్యాక అతడు తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నాడు.

“తన తప్పుల్ని శుద్ధమైన అంతఃకరణంతో పెద్దల ముందు ఒప్పుకుని, ఆ తప్పులను మరెన్నడూ చేయకపోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం”

ఆ కుర్రవాడు ఎవరో తెలుసా….?
ఈ దేశమే కాదు… యావత్ప్రపంచం గౌరవించే వ్యక్తి ఆయన.
ఆయన పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ….!!!

 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

No comments:

Post a Comment

Blog Archive