ప్రారంభ రోజులు తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ హైస్కూల్ హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీ తో కల్సి 1988 లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదు లో 2006 లో జర్గిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేధించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది. దేశవాళీ క్రికెట్ 1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతన సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989 లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగష్టు లో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జర్గిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992 లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు. టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994 లో ఆక్లాండ్ టెస్ట్ లో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు. ఆ టెస్టులో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. అతని తొలి వన్డే సెంచరీ సెప్టెంబర్ 27 , 1994 లో ఆస్ట్రేలియాపై సాధించాడు. తొలి వన్డే శతకానికి 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. 1996 ప్రపంచ కప్ : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చినాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు. 1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే షేన్‌వార్న్ , రోబర్ట్ సన్ లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం. 1999 ప్రపంచ కప్ : 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వే తో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్ లో జర్గిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. షేర్‌వార్న్ కు సింహస్వప్నం : 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం. నాయకత్వం : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాద్యతల నుంచి తప్పుకున్నాడు. అతని తర్వాత 2000 లో సౌరవ్ గంగూలీ కి కెప్టెన్సీ ఇవ్వబడింది. 2003 ప్రపంచ కప్ : 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డిసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది. పేలవ ప్రదర్శన : మార్చి 19, 2006 తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకొనివచ్చింది. క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ దే అత్యధిక స్కోరు. అయిననూ ఆ 3 టెస్టుల సీరీస్ లో అతనిది కనీసం ఒక్క అర్థ శతకం కూడా లేదు. పాకిస్తాన్ XI తో జర్గిన అనధికార ట్వంటీ-20 మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిల్చి ఇంటర్నేషనల్ XI గెలుపుకు కారణమయ్యాడు. జనవరి 2007 లో వెస్ట్ఇండీస్ తో జర్గిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు. 2007 ప్రపంచ కప్ : వెస్ట్ఇండీస్ లో జర్గిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడా పై 57* పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయి కి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమర్శకులకు నోళ్ళు మూయించాడు. దక్షిణాఫ్రికా తో సీరీస్ లో కూడా రెండు సార్లు 90 కి పైగా పరుగులు చేసాడు. ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ చేజిక్కించుకున్నాడు. ఫ్యూచర్ కప్ లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్ గా నిల్చినాడు. 11000 పరుగులు పూర్తి : జూలై 28, 2007 నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు. 2007 అక్టోబర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సీరీస్ లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిల్చినాడు. 1997 లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసాడు. ఆ తర్వాత 1999, 2001, మరియు 2002 లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు. ఇక వన్డే లో ఒకే క్యాలెండర్ సం.లో 1000 పరుగులు సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశాడు.1994, 1996, 1997, 1998, 2000 ,2003 మరియు 2007 లలో ఈ ఘనత సాధించాడు. 1998 లో ఇతను వన్డేలలో 1,894 పరుగులు సాధించాడు. ఇది ఒకే క్యాలెండర్ సం.లో ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. టెస్ట్ కెప్టెన్సీకి విముఖత : నవంబర్ 6 , 2007 న టెండుల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల టెస్టు నాయకత్వం వహించడానికి విముఖత ప్రదర్శించాడు. దీంతో నాయకత్వ వేట మొదలై చివరికి అనిల్ కుంబ్లే కు ఈ కిరీటం లభించింది. సచిన్ టెండుల్కర్ ఎన్నో సెంచరీలు సాధించిననూ సెంచరీలకు చేరువలో అవుటైన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 -100 మద్య స్కోరులో ఔటైనాడు. ఇటీవలే సెప్టెంబర్ 8, 2007 న పాకిస్తాన్ పై మొహాలీ వన్డేలో 99 పరుగుల వద్ద ఔటైనాడు. అదే పాకిస్తాన్ పై సెప్టెంబర్ 15 , 2007 న గ్వాలియర్ వన్డేలో 97 పరుగులకు ఔటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఔటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సం.లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమాయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్నా అర్థ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. 50వ టెస్ట్ సెంచరి : డిసెంబర్ 19, 2010 న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్ధి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. (సచిన్ 50 సెంచరీల సందర్భం గా తన టీం మేట్స్ తో జరిగిన పార్టీ లో ఫోటో) బంగ్లాదేశ్ మీద 100 వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సచిన్ సాధించిన రికార్డులు వన్డే రికార్డులు  - వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
- వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)
- అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (455 వన్డేలు)
- వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
- వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)
- అతిపిన్న వయస్సులో వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.
- అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18152 పరుగులు)
- 10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు.
- ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.
- ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.
- ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)
- ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)
- రాహుల్ ద్రవిడ్ తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు )
- సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609)
- అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు)
- వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.
టెస్ట్ రికార్డులు - పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు
- టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
- టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (63అర్థ సెంచరీలు)
- 20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
- కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
- అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.
- అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (177 టెస్టులు)
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (14692)
- అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)
- 12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.
- విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
- ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్.
|
No comments:
Post a Comment